డిపాజిట్‌దారులను మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్
వేమూరు: ఖాతాదారులను మోసం చేసిన మణికంఠ కోపరేటివ్ బ్యాంక్ నిర్వాహకులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని, దీంతో వారిని రేపల్లె సబ్ జైలుకు తరలించినట్లు సీఐ పీవీ ఆంజనేయులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు... తెనాలి పట్టణానికి చెందిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు 2018వ సంవత్సరంలో చావలి గ్రామంలో శ్రీ మణికంఠ మ్యూచవల్ ఎయిడెడ్ కోపరేటివ్ బ్యాంక్, త్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ ప్రారంభించారు. బ్యాంక్ ద్వారా గోల్డ్‌లోన్, ఆర్‌డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్, మనీ ఇన్‌కామ్ స్కీమ్ రూపంలలో చావలి, చుట్టు పక్కల గ్రామాల ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు, బంగారం తీసుకొని పరారయ్యాడు. చావలి గ్రామానికి చెందిన దేవరకొండ వెంకటేశ్వరమ్మ మే 6వ తేదీన పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అప్పటి నుంచి ఉదయ వెంకటేశ్వరరావు అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడు. ఉదయ వెంకటేశ్వరరావు, అతనికి సహకరించిన తమ్ముడు కొల్లూరు మురళీకృష్ణలను మంగళవారం అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించగా ఇద్దరిని రేపల్లె సబ్ జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


