రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చీరాల: నిర్మాణంలో ఉన్న ఫ్‌లైఓవర్‌పై నుంచి ద్విచక్ర వాహనంతో సహా కిందపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చీరాలలో చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దానవాయిపేటకు చెందిన వాసిపల్లి మోషే (25) మంగళవారం రాత్రి చీరాల వచ్చేందుకు నిర్మాణంలో ఉన్న వాడరేవు–పిడుగురాళ్ళ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ వద్ద ఫ్ల్రైఓవర్ నిర్మాణం సగం మాత్రమే పూర్తయింది. ముందు రోడ్డు ఉందని రహదారిపై అవగాహన లేకపోవడంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించారు. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌పై హెచ్చరిక బోర్డులు లేవంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్సై రాంబాబు తెలిపారు.


