ఆందోళనలతో దద్దరిల్లిన కలెక్టరేట్
రెల్లికాలనీ వాసుల ఆందోళన
బాపట్లటౌన్: వివిధ వర్గాల ప్రజల ఆందోళనలతో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ గోడు చెప్పుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాది ప్రజలు హాజరయ్యారు. వారాలు...నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ బాధితులు కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇళ్లు కూల్చేయవద్దంటూ ఆందోళన
బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో 50 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న పేదలు ఇళ్లు కూల్చి వేయవద్దంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మేమంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులమని, తీరంలో ఏర్పాటుచేసుకున్న గృహాలకు పంచాయతీ అధికారులు 20 ఏళ్ల కిందటే ఇంటి పన్నులు, విద్యుత్ మీటర్లు అమర్చారని తెలిపారు. చిన్న వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికిప్పుడే ఇళ్లు ఖాళీచేసి ఇక్కడ నుంచి వెళ్లిపోమంటున్నారు. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక అల్లాడిపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మా గృహాలు పీకేస్తే మాకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్నారు. మా ఇళ్లు కూల్చి మమ్ములను రోడ్డుపాలు చేయోద్దంటూ కలెక్టర్‌ను కోరారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
కూటమి ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీల జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు, ఏబీసీడీ లుగా వర్గీకరించి చట్టబద్ధంగా అమలు జరపాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాపట్ల రవికుమార్ కోరారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దిబోయిన తాతయ్య, యువజన కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్, జిల్లా కార్యదర్శి మారం రవి కుమార్ పాల్గొన్నారు.
బాపట్ల పట్టణం మూడో వార్డు పరిధిలోని రెల్లి కాలనీ వాసులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ తరతరాలుగా పారిశుద్ధ్య కార్మికులుగా జీవనం సాగిస్తున్నామని, మాకు కనీసం నివసించేందుకు గృహాలు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో, ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మోంథా తుఫాన్‌కు కురిసిన వర్షాలకు గృహాలలోకి నీరు వచ్చిందని, నిలువనీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు సెంట్లు స్థలం ఇచ్చి, గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరారు.


