భూ సేకరణ వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్లటౌన్: జాతీయ రహదారుల ప్రాజెక్ట్ పనులకు భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెళ్లే జాతీయ రహదారులు 544జి, 167ఎ, 16, 544డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన భూసేకరణలో ఉండే కోర్టు సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. బాపట్లలో రైల్వే ట్రాక్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణకు రెవెన్యూ, రైల్వే అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి నివేదిక అందజేయాలన్నారు. ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు అదనంగా 2.53 ఎకరాల భూమి కోసం ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ రైల్వే అధికారులకు సూచించారు. చుండూరు మండలం మోదుకూరు, చుండూరు వద్ద లెవెల్ క్రాసింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. బాపట్లలో రైల్వేస్టేషన్ పరిసరాల అభివృద్ధికి స్థల సేకరణ విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రవహించే ఈస్ట్ తుంగభద్ర డ్రెయిన్, రొంపెరు రైట్ ఆర్మ్, సాఖీ డ్రెయిన్, గుంటూరు ఛానల్, గణపవరం స్వామి డ్రెయిన్, నల్లమడ డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో సమస్యలను అధిగమించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు స్థల సేకరణలో తగు చర్యలు తీసుకోవాలని ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్‌కు తగు సూచనలు చేశారు. బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె మండలాల్లో ప్లాంట్ ఏర్పాటుకు స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ల్యాండ్ ఎక్విజిషన్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీలక్ష్మి, బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు గ్లోరియా, చంద్రశేఖర్, అద్దంకి, జే పంగులూరు, చీరాల, పర్చూరు, కారంచేడు తహసీల్దార్లు, జాతీయ రహదారులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.


