10న సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం ముట్టడి
గుంటూరు ఎడ్యుకేషన్: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎస్.ప్రకాష్, కోశాధికారి ఎం.గంగరాజు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం గుంటూరు జిల్లా సమగ్రశిక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ ఎదుట పోరాట దీక్ష పేరుతో ధర్నా నిర్వహించారు. ఎస్.ప్రకాష్, ఎం.గంగరాజు, ఉపాధ్యక్షుడు కె.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ 21 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాసి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 10న సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని కేటగిరీల్లో ఉద్యోగులకు వేతన పెంపుతోపాటు ఎంటీఎస్, హెచ్‌ఆర్ పాలసీ అమలు, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఒడిశా, పంజాబ్, కేరళ ప్రభుత్వాల మాదిరిగా మన రాష్ట్రంలోనూ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. గతంలో జోవో 3 ప్రకారం పీఆర్సీ ఆఖరి స్కేల్ వేతనాలు చెల్లించిన విధంగా ప్రస్తుత పీఆర్సీ ప్రకారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా పథకానికి కేటాయించాల్సిన 40 శాతం నిధులను బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్ట్ టైం ఉద్యోగులను ఫుల్ టైమ్‌గా మార్చి, ఇతర జిల్లాల్లో సీఆర్పీలను వందల కిలోమీటర్ల దూర ప్రాంతాలకు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని, లేని పక్షంలో పోరాటాలకు సిద్ధపడతామని హెచ్చరించారు. జాబ్ చార్ట్ ప్రకారం సాయంత్రం 5.00 గంటల తరువాత వెబినార్ల పేరుతో వేధింపులు మానుకోవాలన్నారు. అనంతరం గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల ధర్నాకు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.రాజశేఖర్ మద్దతు తెలిపారు. ధర్నాలో జిల్లా నాయకులు సంధ్య, అరుణ్, మాబు సుభానీ, మాధురి, మణి, పార్వతి, వినోద్, సుజిత్, చలపతి, చంద్ర, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


