ఐఏఎల్ మోడల్ పరీక్ష విజయవంతం
గుంటూరు లీగల్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) గుంటూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్‌లోని జస్టిస్ లావు నాగేశ్వరరావు మీటింగ్ హాల్‌లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మోడల్ పరీక్ష శనివారం నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు జరిగింది. మోడల్ పరీక్ష పత్రాలను గుంటూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మోతుకూరి శ్రీనివాసరావు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పర్చూరు కుమారి నంద, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధ సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు కొండవీటి శ్రీనివాసరావు, మంత్రి బాలకృష్ణ, న్యాయవాది కె.శ్రీలక్ష్మీ తిరుపతమ్మల చేతుల మీదుగా అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఏ.ఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారావు మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మోడల్ పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ నెల 30న జరగనున్న ఏఐబీఈ పరీక్ష రాయడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. న్యాయవాదులు కె.నరసింహం, హేమ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
25 నుంచి అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు చెప్పారు. పోటీల కరపత్రాలను శనివారం వారు విడుదల చేశారు. పోటీలలో భాగంగా వర్సిటీ టీమ్‌ను ఎంపిక చేస్తారని వివరించారు. పోటీలు నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీలను ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), డాక్టర్ చదలవాడ అరవిందబాబు (నరసరావుపేట), వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలల జట్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రెంటచింతల: మండల పరిధిలోని గోలి గ్రామ శివారులో ఉన్న నాగమయ్యస్వామి దేవస్థానం సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం హాలియాకు చెందిన కంటోజు పరిపూర్ణాచారి(42) తన అన్న శ్రీనివాసచారితో కలిసి గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెలు భర్త గోవిందాచారిని పరామర్శించారు. వారు తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామం హాలియా వెళ్తున్న సమయంలో నాగమయ్య దేవస్థానం సమీపంలో సమాధానపేటకు చెందిన వేల్పుల నరేంద్ర, జొన్నలగడ్డ సంతోస్, గుంజరి వెంకటేష్ ముగ్గురు మరో ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ బలంగా ఢీకొనడంతో రెండు వాహనాలపై నున్న ఐదుగురు కిందపడ్డారు. ప్రమాదంలో పరిపూర్ణాచారి తల బలంగా రోడ్డుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఏపీ జన్‌కో అంబులెన్స్ వాహనంలో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని నరసరావుపేటకు తరలించారు. పరిపూర్ణాచారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


