భార్యను హత్యచేసిన భర్త అరెస్ట్
మంగళగిరి టౌన్: వివాహేత సంబంధం నేపఽథ్యంలో భార్యను హతమార్చిన భర్తను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలు వెల్లడించారు. పిఠాపురానికి చెందిన శివశంకర్‌రెడ్డి విజయవాడ పెనమలూరుకు చెందిన శివపార్వతి (29)ని ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని కొద్దికాలం విజయవాడలో కాపురం ఉన్నారు. అప్పటికే వ్యాపారంలో నష్టం రావడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈక్రమంలో శివపార్వతికి మంగళగిరి చినకాకాని గ్రామానికి చెందిన ఓ ఎలక్ట్రీషియన్‌తో పరిచయం ఏర్పడింది. భార్యాభర్తలు విడిపోగా ఐదునెలల క్రితం ఎలక్ట్రీషియన్‌తో కలసి మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తోంది. భార్య కోసం వెతికే క్రమంలో యర్రబాలెంలో ఉంటోందన్న సమాచారం తెలుసుకున్న శివశంకర్‌రెడ్డి ఎవరూ లేని సమయంలో నేరుగా ఇంట్లోకి వెళ్లి శివపార్వతి గొంతు నులిపి హత్యచేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి బంధువులు ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం దర్యాప్తు ప్రారంభించి శనివారం నిందితుడు శివ శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ వెంకట్ పాల్గొన్నారు.


