మద్దతు మమ.. కొనుగోలు భ్రమ! జిల్లాలో మండలాల వారీగా వరి సాగు ఇలా..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతులు పండించిన ధాన్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఈ సీజన్‌లో కూడా మద్దతు ధరకు కొనే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో ఖరీఫ్‌లో 2,91,106 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 6,55,212 టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వాస్తవానికి ఇంతకు మించి సాగు ఉంటుందని, 7 లక్షల టన్నులకు తగ్గకుండా ధాన్యం దిగుబడి రావచ్చని అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 2 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే రైతుల నుంచి సేకరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకనుగుణంగా పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 117 ధాన్యం కొలుగోలు కేంద్రాలు సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ మేనేజర్ ప్రకటించారు. 74 ఽరైస్ మిల్లుల ద్వారా ఽరైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ధాన్యం సేకరణ మొదలు కానుంది.
చేతులు దులుపుకొంటే ఎలా? 6.55 లక్షల టన్నుల ధాన్యం రైతులవద్ద ఉంటుందని భావిస్తే... ప్రభుత్వం కేవలం 2 లక్షల టన్నుల ధాన్యం సేకరించి చేతులు దులుపుకొనేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిలో మిగిలిన ధాన్యం ఎవరు కొనాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. ప్రభుత్వం 75 కిలోల ధాన్యం బస్తాకు గ్రేడ్ – ఏ కింద రూ. 1,792, సాధారణ రకానికి బస్తా రూ.1,777 మద్దతు ధరగా ప్రకటించింది. వాస్తవానికి ఈ ధర లభిస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. కానీ మిగిలిన 4.55 లక్షల టన్నుల ధాన్యాన్ని బయట మార్కెట్‌లో దళారులు, రైస్ మిల్లులకు విక్రయించాలని ప్రభుత్వమే పరోక్షంగా చెబుతోంది. ప్రస్తుతం 75 కిలోల ధాన్యం బస్తా కేవలం రూ.1,420 పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాబడి సంగతి దేవుడెరుగు పెట్టిన పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మేలు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ధాన్యం తడిసినా, ఇతరత్రా కారణాలతో పాడైనా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది. పైగా బయట మార్కెట్‌లోనూ అన్ని పంటల్లాగే ధాన్యం ధరలు అధికంగా ఉన్నాయి. వరి ధాన్యం బస్తా రూ. 2 వేల వరకు పలికింది. దీంతో రైతులు ప్రైవేటు మార్కెట్‌లో గిట్టుబాటు ధరకు ధాన్యం అమ్ముకుని లబ్ధి పొందారు. చంద్రబాబు పాలనలో ప్రైవేటు మార్కెట్‌లో ధాన్యం ధరలు పూర్తిగా పడిపోయాయి.
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం
చంద్రబాబు పాలనా వైఫల్యంతో యూరియా, ఇతర ఎరువుల కొరత వల్ల వరి సాగు సమయంలో రైతులు ఇబ్బందిపడ్డారు. తరువాత వచ్చిన తుఫానులు, అధిక వర్షాలు పంటను దెబ్బతీశాయి. దీంతో ఖరీఫ్‌లో వరి దిగుబడులు తగ్గాయి. గతంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుండగా.. ఇప్పుడు ఎకరానికి 25 నుంచి 30 బస్తాలలోపే దిగుబడి రానుంది. రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి కొనాల్సిన చంద్రబాబు ప్రభుత్వం... ఆ పని చేయడం లేదు. ప్రభుత్వం స్పందించి మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
● జిల్లాలో 2,91,106
ఎకరాల్లో వరి సాగు
● ధాన్యం దిగుబడి అంచనా
6.55 లక్షల టన్నులు
● చంద్రబాబు ప్రభుత్వం కొంటానని
చెప్పింది 2 లక్షల టన్నులే
● బయట బస్తా ధాన్యం
ధర రూ.1,420 మాత్రమే
● రూ. 2 వేలకు విక్రయిస్తే
తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి
● మద్దతు ధరకు మొత్తం ధాన్యం
కొనాలంటున్న రైతులు
1/1
మద్దతు మమ.. కొనుగోలు భ్రమ!