పక్కాగా ధాన్యం సేకరణ ప్రక్రియ ఉండాలి
బాల్య వివాహాలను నివారించాలి
బాపట్ల: ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి ప్రణాళికతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా, మండల, సచివాలయాల స్థాయి అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని ప్రాథమిక సమాచారం ఉందన్నారు. 117 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. టార్పాలిన్ పట్టలు, గోనె సంచులు సిద్ధం చేసుకోవాలన్నారు. రైస్ మిల్లులు వివరాలు అందుబాటులో ఉండాలన్నారు. రైతులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ బృందాలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. 60 తేమ యంత్రాలు సిద్ధంగా ఉంచామని, 73 మిల్లులను ఎంపిక చేశామన్నారు. అవసరమైతే గోనెసంచులు సమకూర్చుకోవాలని సూచించారు. ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ అనుసంధానించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి అమీర్ బాషా, సంస్థ జీఎం శివపార్వతి, వ్యవసాయ శాఖ డీడీ అన్నపూర్ణ, సచివాలయాల కోఆర్డినేటర్ యశ్వంత్, ఆర్‌డీఓలు, మండల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.
నాయకత్వం, నిర్వహణ బాధ్యతలు కీలకం
నాయకత్వం, నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే జీవితంలో విజయాలు సొంతం అవుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, బృందంతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలన్నారు. మొదట శాస్త్రవేత్తను కావాలనుకున్నా... వైద్యుడిగా పట్టభద్రుడనై... తర్వాత ఐఏఎస్ అధికారిగా నిలిచానని తెలిపారు. వైద్యుడిగా ఉన్నప్పుడు మారుమూల గ్రామీణ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారని, సామర్థ్యం ఉన్నప్పటికీ నెల రోజులు ఎలాంటి ఆపరేషన్లు చేయకుండా ఉండడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. దీంతో వెంటనే సివిల్స్‌కు సిద్ధమయ్యానని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసన్నారాణి, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాల రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యార్థినులపై ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం స్థానిక బాపట్ల పట్టణంలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. ‘ప్రతి బిడ్డకు–ప్రతి హక్కు‘ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థినుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాల్య వివాహాలు అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థినులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలంటే బాగా చదవాలన్నారు. బాలల హక్కులను పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయన్నారు. తాను కూడా ప్రభుత్వ వసతి గృహంలోనే ఉంటూ ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నానని మననం చేసుకున్నారు. బాగా చదువుకోవాలని నా తల్లిదండ్రులు నిత్యం చెబుతూ ఉండే వారన్నారు. తల్లిదండ్రులే జీవితాలకు స్పూర్తి కావాలి, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి స్థాయికి ఎదగాలని కోరారు. బాలల హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి అన్నారు. కార్యక్రమంలో డీఈవో పురుషోత్తం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


