రణక్షేత్రంలో కొలువుదీరిన అలనాటి ఆయుధాలు
కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా గురువారం రాయబారం ఉత్సవం వైభవంగా జరిగింది. వీరుల గుడి నిండుగా పల్నాటి వీరుల ఆయుధాలు కొలువుదీరాయి. వందలాదిగా భక్తజనం ఆయుధాల(దైవాలు)కు పూజలు చేశారు. ఉత్సవ ప్రారంభ ఘట్టం రాచగావు బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగింది. బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం సమక్షంలో వీర విద్యావంతులు రాచగావు కథాగానం చేశారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ మండపంలో ఆశీనులు కాగా, వీరాచారులు కంటి మీద కునుకు లేకుండా తెల్లవార్లూ కథాగానం విన్నారు. అనంతరం రాచగావు క్రతువు ముగించి వీరాచారులకు తాంబూలాలిచ్చి కంకణధారణ చేశారు. తర్వాత సేద దీరిన అనంతరం ఉదయం 10 గంటలకు వీరుల గుడిలో కొలువుదీరిన ఆయుధాలను గ్రామోత్సవానికి సిద్ధం చేశారు. వీరుల గుడిలో ఒక్కొక్కరుగా కత్తిసేవలు పూర్తి చేసుకుని తర్వాత అంతా కలసి ఊరేగింపుగా చెన్నకేశవస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆయుధాల వెనుక అంకమ్మ బుట్టలతో భక్తులు నిల్చున్నారు. అంతా గ్రామోత్సవంగా బయలుదేరి చెన్నకేశవుని ఆలయానికి చేరుకున్నారు. తర్వాత ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్దకు తరలివచ్చి విగ్రహానికి పూలమాలలు, ధూపం వేసి నివాళులర్పించారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఎదుట ఆయుధాలన్నీ శిరస్సు వంచి మొక్కాయి. తర్వాత కోట బురుజు మీదుగా పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఇంటికి తరలివెళ్లి ఆయనను తోడ్కొని వీరుల గుడికి చేరుకున్నారు. గుడిలో ఆయుధాలను కొలువుదీర్చి ఆ రోజు గ్రామోత్సవాన్ని ముగించారు. ఇదిలా ఉంటే నూతనంగా వచ్చిన వీరాచారులు నాగులేరు గంగధారిలో స్నానాలు చేసి తమ ఆయుధాలను శుభ్రం చేసుకుని పూజ కట్టుకున్నారు. అనంతరం వారు చెన్నకేశవస్వామి, అంకాలమ్మలను దర్శించుకుని వీరారాధనలో పాల్గొన్నారు. రెండవ రోజు కూడా వీరాచారుల రాక కొనసాగుతోంది.
రాయబారం కథాగానం
గురువారం రాత్రి వీర విద్యావంతులు రాయబారం చారిత్రక ఘట్టం కథాగానాన్ని చేశారు. కోడి పందేలలో ఓడిన బ్రహ్మనాయుడు, మలిదేవుడు పరివారం అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత తన బావ మలిదేవుడుకు రాజ్యభాగం ఇవ్వాలని మామను అడగడానికి అలరాజును రాయబారిగా బ్రహ్మనాయుడు గురజాలకు పంపాడు. రాయబారం విఫలమై తిరుగు ప్రయాణంలో చర్లగుడిపాడు వద్ద సేద తీరుతున్న సమయంలో విషప్రయోగానికి గురై అలరాజు మృతి చెందడం ఆ తర్వాత దాయాదుల మధ్య కక్షలు పతాకస్థాయికి చేరి పల్నాటి యుద్ధానికి దారి తీస్తుందనే కథాగానం చేస్తారు. దాయాదుల మధ్య జరిగిన విషాదభరిత ఇతివృత్తం కావడంతో కథకులు కన్నీరు తెప్పించే విధంగా విపులంగా రాయబారం కథను గానం చేశారు.


