గిరిజనుల సంక్షేమానికి కృషి
బాపట్ల టౌన్: జిల్లాలోని గిరిజన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన సమరయోధుడు బీర్సాముండా జయంతి సందర్భంగా నవంబర్ 1 నుంచి 15 వరకు పలు కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. గిరిజన సమరయోధులు బీర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, గాము ఘంటాదొర, గాము మల్లదొర, బోనంగి పండుపడాల్, కుడుముల పెద్ద బయ్యన్న, హనుమంతప్ప, కారం తమ్మన దొరలను స్మరించుకోవడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బి.ప్రకాష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా విద్యా శాఖఅధికారి పురుషోత్తం, సాంఘిక సంక్షేమశాఖ అధికారి రాజ్ దిబోరా, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, గిరిజన సంఘాల నాయకులు కె.ప్రసాదు, బి.వెంకటేశ్వర్లు, డి.రాము పాల్గొన్నారు.
రాకపోకలకు సమస్య లేకుండా చూడాలి
జిల్లాలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ రోడ్డుల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరావాస కేంద్రలలోని వారికి ఆర్థిక సహాయాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీలు బియ్యం, ఇతర సరకులు అందించాలని ఆదేశించారు. డ్రైనేజీ ద్వారా నీటిని సముద్రంలోకి పంపించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా 10 వేల హెక్టార్లలో నీరు నిలిచి ఉందని, రైతులతో కలసి తొలగించాలన్నారు. తుఫాన్‌కు సంబంధించి జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల వేళ జాగ్రత్త
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం వల్ల ఆ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్


