● కార్తిక పౌర్ణమి స్నానాల
వేళ అప్రమత్తత ముఖ్యం
● తీరంలో అన్ని వసతులు కల్పించాలి
● ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు ఆదేశం
చీరాల టౌన్: ఈ నెల 5వ తేదీన కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సముద్ర స్నానాలకు వచ్చే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడు పేర్కొన్నారు. శనివారం రెవెన్యూ, పోలీస్, ఫైర్, పంచాయతీరాజ్, మెడికల్, ఆర్‌డబ్ల్యూఎస్, మైరెన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్నానాలకు దాదాపు లక్ష మంది వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలకు వస్తారని అంచనా వేశామన్నారు. ప్రత్యేకంగా పోలీస్ అవుట్ పోస్టు, వైద్య సౌకర్యాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు సముద్రంలో లోపలకు వెళ్లకుండా ఎరుపు జెండాలను పాతాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. తాగునీరు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా బీచ్‌లను మొత్తంగా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లించాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. బీచ్ రిసార్టుల యజమానులు కూడా పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైఫ్ జాకెట్లు ఇవ్వాలని కోరారు. తహసీల్దార్ కుర్రా గోపికృష్ణ, మైరెన్ సీఐ శ్రీనివాసరావు, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ నాగరాజు, ఈవోఆర్డీ రామకృష్ణ, ఆర్‌ఐ శేఖర్, మత్య్సశాఖ అధికారి కృష్ణకిషోర్, పంచాయతీ కార్యదర్శులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


