ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలి
బాపట్ల: ఉద్యోగులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు టి.కస్తూరిబాయ్ అన్నారు. ఆ శాఖ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉద్యోగుల హాజరు పట్టిక, పలు దస్త్రాలను ఆమె పరిశీలించి సంతకాలు చేశారు. ప్రభుత్వం ఆశించిన మాదిరిగా మీరంతా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల లోకి తీసుకువెళ్లాలన్నారు. జిల్లా పరిపాలన వ్యవస్థకు అనుబంధంగా పనిచేయాల్సిన బాధ్యత సమాచారం శాఖపై ఉందన్నారు. సిబ్బంది సమయపాలనను తప్పక పాటించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా సిబ్బంది పనిచేయాలన్నారు. సిబ్బంది అందరూ అధికారి సూచనల మేరకు సంతోషకరమైన వాతావరణంలో పని చేసి, వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి పి వెంకటరమణ, జిల్లా పౌర సంబంధాల అధికారి టి మోహన్ రాజు, సహాయ కార్యనిర్వాహక సమాచార ఇంజినీరు షేక్ మస్తాన్, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాంతీయ సంయుక్త సంచాలకులు టి.కస్తూరిబాయ్


