‘మించాల’కు స్వపక్ష కౌన్సిలర్ల సెగ
చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలతో టీడీపీ కౌన్సిలర్ల విమర్శలు
తమ మద్దతుతో ఎన్నికై వార్డుల్లో పనులు చేయొద్దని చెప్పడం విడ్డూరం
కోరం లేక వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం
చీరాల: అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఒక వైపు చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెబుతుంటే మరో వైపు మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు మాత్రం వార్డుల్లో జరిగే అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు గుంటూరు ప్రభాకరరావు, ఎస్.సత్యానందం చైర్మన్‌పై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పనులు ప్రారంభించడానికి వీలు లేదని ఆయనే అధికారులతో చెబుతున్నట్లుగా తమకు సమాచారం ఉందంటూ మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే వ్యవహరిస్తుండటంతో భగ్గుమన్నారు. ఆయన తీరుకు నిరసనగా శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు.
17 మంది అవిశ్వాస తీర్మానం
చీరాల మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావుపై ఈ ఏడాది ఏప్రిల్‌లో టీడీపీకి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు 17 మంది అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. ఆ తర్వాత మే నెలలో జరిగిన అవిశ్వాసంపై నెగ్గిన టీడీపీ కౌన్సిలర్లు 25 మంది.. చైర్మన్‌గా మించాల సాంబశివరావును ఎన్నుకున్నారు. అయితే ఆయన చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అభివృద్ధి పనులు చేయించడంలో విఫలమయ్యారని టీడీపీ కౌన్సిలర్లే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పనులు చేయవద్దు, బిల్లులు పెట్టవద్దంటూ అధికారులకు చెప్పడం సబబు కాదంటూ కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావు అన్నారు. అలానే చెరువు కట్టపై ఉన్న నీడనిచ్చే చెట్లు కూడా తొలగించారని కౌన్సిలర్ సత్యానందం వాపోయారు.
వైఎస్సార్ సీపీ వార్డులపై శీతకన్ను..
చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వార్డుల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులు ప్రారంభించకుంటే నిధులు వెనుతిరిగే ప్రమాదం ఉంది. ఈ విషయంపై కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు గళమెత్తినా పట్టించుకోవడం లేదు. చైర్మన్ వైఖరిపై విసుగెత్తిన టీడీపీ కౌన్సిలర్లు ఎక్కువ మంది శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూడా గైర్హాజరయ్యారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా 30 నిమిషాల తర్వాత ఏడుగురు కౌన్సిలర్లు మాత్రమే సమావేశానికి వచ్చారు. కోరం లేక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. 25 మంది మద్దతుతో చైర్మన్‌గా ఎన్నికై న ఆయనకు ఏడుగురు మాత్రమే మద్దతుగా నిలిచారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


