
ఇంజినీరింగ్ కార్మికుల వినూత్న నిరసన
రేపల్లె: సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మణిలాల్ అన్నారు. ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరం శుక్రవారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం పొర్లు దండాలు పెట్టారు. కూటమి ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వంగా, ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వంగా అభివర్ణించారు. మణిలాల్ మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించమంటే ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ వ్యతిరేకతను మూటకట్టుకుంటోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత కార్మికులుగా చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. చట్టపరమైన సెలవులను అమలు చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్.రవిబాబు, కె.రాఘవేంద్రరావు, రవి, శ్రీను, సుబ్బారావు, సుధాకర్, వాసు తదితరులు పాల్గొన్నారు.