
జీవన ఎరువులతో ఆరోగ్యకర దిగుబడులు
సత్తెనపల్లి: సాగులో ఫాస్ఫరస్ సాలుబు లైజింగ్ బాక్టీరియా, అజోల్లా, వామ్ తదితర జీవన ఎరువులు వాడుకుని ఆరోగ్యవంతమైన దిగుబడులు సాధించాలని పల్నాడు జిల్లా రైతు శిక్షణ కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(డీడీఏ) ఎం.శివకుమారి సూచించారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకోవాలని ఆమె చెప్పారు. మండలంలోని గుడిపూడిలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీడీఏ శివకుమారి మాట్లాడుతూ ఆఖరి దుక్కిలో ఫాస్ఫరస్ వేసుకోవాలని, దీనివల్ల వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. నారు మడిలో చల్లుకునే ముందు శిలీంధ్ర నాశిని అయిన కార్బెండిజం మూడు గ్రాములను కేజీ వరి విత్తనాలకు కలిపి, విత్తన శుద్ధి చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా విత్తన దశ నుంచే తెగుళ్లను నివారించవచ్చని తెలిపారు. జిల్లా రైతు శిక్షణ కేంద్రం అధికారిణి ఎం.అరుణ మాట్లాడుతూ తొలకరి వర్షాలకు నవ ధాన్యాలను సాగు చేసుకొని పూత దశలో భూమిలో కలియ దున్నుకోవాలని చెప్పారు. దీని వల్ల సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెంది, భూమి సారవంతం అవుతుందని వివరించారు. సత్తెనపల్లి మండల వ్యవసాయధికారి బి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ పత్తి, మిరప, వరి సాగు చేసే రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువులను వేసి, పూత దశలో భూమిలో కలియ దున్నుకోవాలని సూచించారు. మిరప రైతులు షేడ్ నెట్ లలో నారు పెంచుకోవాలని ఆమె చెప్పారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం కింద 100 శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందజేసిన మినుములు, కంది విత్తనాల చిరు సంచులను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శివకుమారి