
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం
దాచేపల్లి : వ్యవసాయ రంగాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు గురువారం కిసాన్ మేళా నిర్వహించారు. ఇందులో రైతుల ప్రదర్శనలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు , తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి పరిశీలించారు. ఆధునిక పద్ధతులను అవలంబించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించేలా రైతులు వ్యవసాయం చేయాలని మంత్రి రవికుమార్ చెప్పారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సహకారం అందించి అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌న్వెషన్ ఏఎన్‌జీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జి.శివన్నారాయణ, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఏఎన్‌జీఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పి.వి సత్యనారాయణ, పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, డీఆర్‌ఓ మురళి, ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.
రైతుల్లో తీవ్ర అసంతృప్తి
పంటలకు కనీసం గిట్టుబాటు ధరతో పాటు పొగాకు కొనుగోలుపై కిసాన్ మేళాలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు నుంచి హామీ వస్తుందని రైతులంతా ఎదురు చూశారు. వీటిపై సరైన స్పష్టత ఇవ్వకుండానే మేళాను ముగించడంపై రైతులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు.
జిల్లా స్థాయిలో మాచవరం పీహెచ్‌సీకి మొదటి స్థానం
రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం
మాచవరం: గ్రామీణ ప్రాంత ప్రజలకు జూన్‌లో మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించినందుకు గానూ మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లాలో మొదటి స్థానం దక్కిందని పీహెచ్‌సీ వైద్యాధికారి ఎస్. ప్రసాదరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల్లోనూ రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచిందని ఆయన తెలియజేశారు. ఇటీవల పీహెచ్‌సీల పనితీరుపై వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహించిన నివేదికలో అధికారులు గ్రేడ్‌లను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. మెరుగైన వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.
మంత్రి గొట్టిపాటి రవికుమార్

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం