వైఎస్సార్‌ సీపీ నిరసన | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నిరసన

Jul 18 2025 5:14 AM | Updated on Jul 18 2025 5:14 AM

వైఎస్సార్‌ సీపీ నిరసన

వైఎస్సార్‌ సీపీ నిరసన

‘సాక్షి’ ప్రసారాల

నిలిపివేతపై

తెనాలి: సాక్షి చానల్‌ ప్రసారాల నిలిపివేతపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జెండాలతో ప్రదర్శనగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో స్థానిక కేబుల్‌ చానళ్లలో సాక్షి చానల్‌తోపాటు టీవీ9, ఎన్టీవీ తదితర చానళ్ల ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికం అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించటమే కాకుండా, ప్రజలకు వాస్తవాలను తెలియకుండా అడ్డుకోవాలని చూడటమేనని పార్టీ నాయకులు ఆరోపించారు. సూపర్‌సిక్స్‌ హామీలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన వందల వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగించటం, పాలనలో వైఫల్యాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రశ్నించిన వారిపై కేసులు బనాయించటం వంటి వాస్తవాలను ప్రజాపక్షం వహించి ప్రసారం చేస్తున్న సాక్షి గొంతు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు.

ఒత్తిడి తెచ్చి మరీ...

పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాయ్‌తో సంబంధం లేకుండా బ్రాడ్‌కాస్టర్లు, ఎంఎస్‌ఓలపై ఒత్తిడి తీసుకొచ్చి సాక్షి ప్రసారాలను నిలిపివేయటం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ అనుకూల చానళ్లపైనా ఇదే చర్య తీసుకోవాలని సందేశం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. పార్టీ లీగల్‌ సెల్‌ న్యాయవాది చింకా సురేష్‌చంద్రయాదవ్‌ మాట్లాడుతూ కేబుల్‌ టీవీ ఖాతాదారులకు సాక్షి, మరికొన్ని చానళ్ల ప్రసారాలను అందించకపోవడంపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పారు. అంతవరకు వెళ్లాలని తాము అనుకోవటం లేదని, ఎంఎస్‌ఓలు, బ్రాడ్‌కాస్టర్లను సంప్రదించి అన్ని చానళ్లను ప్రసారం చేయాలని చెప్పారు.

అప్రజాస్వామిక వైఖరి

పార్టీ మహిళా నేత, మున్సిపల్‌ కౌన్సిలరు కొర్రపాటి యశోద మాట్లాడుతూ భజన చేసే చానళ్లను మాత్రమే ప్రసారం చేస్తూ, విమర్శించే వాటి ప్రసారాలను నిలిపివేయటం అప్రజాస్వామికం అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని విమర్శించారు. సూపర్‌సిక్స్‌ హామీల మోసం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, న్యాయవాది మైలా విజయ్‌నాయుడు కూడా మాట్లాడారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాలేపాటి హరిప్రసాద్‌, గోల్డ్‌ రహిమా, తాడిబోయిన రమేష్‌, బొంతు నరేంద్రరెడ్డి, మన్నవ ప్రభాకర్‌, కాకి దేవసహాయం, కొడాలి క్రాంతి, ఆవుల కోటయ్య, పెదలంక వెంకటేశ్వరరావు, కటెవరపు దేవానంద్‌, బండ్లమూడి నాగేశ్వరరావు, అక్కిదాసు కిరణ్‌, మల్లెబోయిన రాము, అమర్తలూరి సీమోను, పినపాటి రవికిరణ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్‌, న్యాయవాదులు గుమ్మడి రవిరాజ్‌, దాట్ల మోహన్‌రెడ్డి, డి.మల్లికార్జునరెడ్డి, గుంటూరు కృష్ణ, మహిళా నేతలు తమ్మా సుజాతరెడ్డి, షేక్‌ జకిరా, షేక్‌ ఇస్రత్‌, ఇందిర, రెడ్డి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement