
టౌన్‌హాలుకు ఘన చరిత్ర ఉంది
బాపట్ల అర్బన్: అనాదిగా ఎన్నో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు బాపట్ల టౌన్ హాల్ పట్టుగొమ్మగా నిలిచిందని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. టౌన్ హాలు 120వ వార్షికోత్సవ కార్యక్రమంలో గురువారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ టౌన్ హాల్‌ను 1905 జూలై 17న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రూడీ ప్రారంభోత్సవం చేశారన్నారు. టౌన్ హాల్‌కు 12 దశాబ్దాల చరిత్ర ఉందని తెలిపారు. ఎందరో జాతీయ నాయకుల ప్రసంగాలకు వేదికగా టౌన్ హాలు నిలిచిందని పేర్కొన్నారు. 1913లో ప్రథమాంధ్ర మహాసభ ఇక్కడే జరిగిందని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు ఇక్కడే బీజం పడిందని తెలిపారు. ఇది ఎందరో కవులు, కళాకారులకు ఆలంబనగా నిలిచిందని అన్నారు. చారిత్రక టౌన్ హాల్ 120వ వార్షికోత్సవ సందర్భంగా ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, నాటి టౌన్‌హాల్ వ్యవస్థాపకులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి డాక్టర్ పి సి సాయిబాబు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఏవీ రమణారావు, రచయిత మల్లికార్జున, ఖాజీపాలెం డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్ కృష్ణంరాజు, అధ్యాపకులు డాక్టర్ అబ్దుల్ కలాం, రత్నేశ్వరరావు, మల్లేశ్వరి, సుశీలావతి, వెంకటలక్ష్మమ్మ, పద్మజ, విద్యార్థులు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా