
సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఆగదు
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె డివిజన్ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజినీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె గురువారంతో నాల్గవ రోజుకు చేరింది. సమ్మె శిబిరాన్ని సందర్శించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో విధులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమ్మె చేసిన సందర్భంగా 17 రోజులకు జీతాలు ఇతర బెనిఫిట్స్ అందిస్తామని చేసిన ఒప్పందాలను అమలు చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులందరికి వర్తింపజేసి కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి రవిబాబు, కోశాధికారి రాఘవేంద్రరావు, నాయకులు శివ, రవి, శ్రీను, సుబ్బారావు, వాసు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రభాకరరావు