
బదిలీ అయిన ఉపాధ్యాయులకు వేతనాలివ్వాలి
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు ముగిసిన 45 రోజుల తరువాత సైతం కొంత మంది ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని, వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ .. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ బదిలీల్లోని అసంబద్ధ అంశాలు తొలగించి, సవరణ ఉత్తర్వులు కోరుతూ అనేక మంది ఉపాధ్యాయులు పెట్టుకున్న గ్రీవెన్స్‌ను త్వరగా పరిష్కరించాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు. రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ మెగా పీటీఎం విట్నెస్‌పై ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చి మరీ విద్యాశాఖాధికారులు సమాచారాన్ని సేకరించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, కె.సాంబశివరావు, ఎండీ షకీలా బేగం, టి.ఆంజనేయులు, కె.కేదార్‌నాథ్, కె.ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.