
ఐకార్ విశ్రాంత శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి అధ్యక్షతన ఐకార్ (ఐసీఏఆర్) విశ్రాంత శాస్త్రవేత్తలతో విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులు, శాస్త్రవేత్తలతో చర్చా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాంనందున్న విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐకార్ విశ్రాంత శాస్త్రవేత్తలైన ప్రధాన శాస్త్రవేత్త (ఇక్రిశాట్) డాక్టర్ ఎస్‌ఎన్ నిగం, డైరెక్టర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్) డాక్టర్ డీఎం హెగ్డే, ఐకార్ ఏడీజీ డాక్టర్ బీబీ సింగ్‌లు పాల్గొన్నారు. కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా వ్యవసాయంలో నేల ఆరోగ్య పరిరక్షణ అనే వ్యవసాయ బులెటిన్‌ను రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది వినియోగించుకునేందుకు వీలుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్‌ఎన్ నిగం మాట్లాడుతూ వివిధ పంటల రకాల రూపకల్పనలో ఆధునిక పద్ధతులతోపాటు సంప్రదాయ విధానాలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. పరిశోధనలలో సరైన ప్రణాళికలు ముందుగానే రూపొందించుకుని చేయటం వల్ల ఆశించిన ఫలితాలను సులువుగా సాధించవచ్చన్నారు. వివిధ పంటల్లో బ్రీడింగ్ విధానాలు, విత్తన ఉత్పత్తి తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.రామచంద్రరావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, కమ్యూనిటీ సైన్స్, ఏపీజీసీ శాస్త్రవేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.