
‘మధ్యవర్తిత్వం–దేశం కోసం’ ప్రదర్శన
బాపట్ల: మధ్యవర్తిత్వం–దేశం కోసం అనేది ప్రతి ఒక్కరూ గమనించాలని అడిషనల్ డిస్టిక్ జడ్జి ఓ.శ్యామ్‌బాబు అన్నారు. మధ్యవర్తిత్వం–దేశం కోసం అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం బాపట్ల పట్టణంలో జిల్లా కోర్టు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి బయలుదేరి పాత బస్టాండ్ వరకు నిర్వహించారు. అడిషనల్ డిస్టిక్ జడ్జి ఓ.శ్యామ్‌బాబు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా తగాదాలు, వివాదాలు పరిష్కరించే విషయంపై ప్రజల్లో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల సమయం వృథా కాకుండా చేసుకోవచ్చని ఇది కోర్టు తీర్పు కంటే బలమైనదిగా భావించాలన్నారు. ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని కోరారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ.అవినాష్ మాట్లాడుతూ ఈ మధ్యవర్తిత్వం పూర్వకాలం నుంచి ఉందని కృష్ణుడు కూడా పాండవులు, కౌరవుల మధ్య సంధి కుదర్చటానికి ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎ.వాణి, సీనియర్ సివిల్ జడ్జి పవన్‌కుమార్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎ.రేణుక తదితరులు పాల్గొన్నారు.