
వ్యవసాయ, విజిలెన్స్ అధికారుల తనిఖీలు
రేపల్లె: రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులనే విక్రయించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైలవరం వ్యవసాయ సహాయ సంచాలకులు టి.శ్రీనివాసరావు హెచ్చరించారు. పట్టణంలోని ఫెర్టిలైజర్స్ దుకాణాలపై వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల ఎదుట తప్పనిసరిగా స్టాక్ బోర్డును, ధరల పట్టిక వినియోగదారులకు కనిపించేలా ఏర్పాటు చేయాలన్నారు. విత్తనాల నాణ్యతలో రాజీపడరాదని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించరాదన్నారు. దుకాణాలలో స్టాక్‌కు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో రేపల్లె వ్యవసాయ సమాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మహేష్‌బాబు, విస్తరణ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.