
జాతీయ అవార్డు... చేనేతలకు అంకితం
బాపట్ల: ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి‘ పేరుతో కుప్పడం పట్టు చీరలకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన జాతీయ స్థాయి అవార్డును చేనేతలకు అంకితం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నుంచి కలెక్టర్ అవార్డును అందుకున్న విషయం విదితమే. జాతీయస్థాయి అవార్డును అందుకుని బాపట్ల వచ్చిన జిల్లా కలెక్టర్ వెంకట మురళిని వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా బుధవారం కలసి సన్మానించి, అభినందనలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ చీరాల కుప్పడం పట్టు చీరలు ఎప్పటినుంచో ప్రాచుర్యం పొందాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డుతో మరింత వెలుగులోకి వచ్చిందన్నారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఒక జిల్లా–ఒక ఉత్పత్తి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ స్థాయి అవార్డు, గౌరవం చేనేతలకే చెందుతుందన్నారు. కుప్పడం పట్టు చీరలను ఆన్‌లైన్ వ్యాపార వేదికకు అనుసంధానం చేయాలన్నారు. సూర్యలంక బీచ్, వాడరేవు బీచ్ వద్ద, చీరాల పట్టణం, బాపట్ల పట్టణంలోని ప్రధాన కూడలిలో కుప్పడం పట్టు చీరల ప్రదర్శన, అమ్మకాలు జరపాలన్నారు. పొదుపు సంఘాల ద్వారా సంబంధిత నాలుగు ప్రాంతాలలో దుకాణాలు ఏర్పాటుచేసి, వ్యాపారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశమంతా ప్రాచుర్యం పొందిన కుప్పడం పట్టు చీరల ఉత్పత్తి విస్తృతం కావాలని, చేనేత కుటుంబాల్లోని నిరుద్యోగులు ఆసక్తిగా చేనేత వృత్తిలోకి అడుగులు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచి ధరలు రావాలి, చేనేత వృత్తి లాభదాయకంగా మారాలి, చేనేతలకు మరింత ప్రయోజనం కల్పించడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం అన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ షాలెంరాజు, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల, రేపల్లె ఆర్డీవోలు పి.గ్లోరియా, రామలక్ష్మి, డీఎల్‌డీఓ విజయలక్ష్మి, అనుబంధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి కలెక్టర్‌ను సన్మానించిన అధికారులు
బంగారు కుటుంబాల నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే చేపట్టాలి
బాపట్ల: బంగారు కుటుంబాల నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే కార్యక్రమం ఈనెల 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీ–4 కార్యక్రమం అమలు తీరుపై జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వే నిర్వహించే ఉద్యోగులకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ ముగియగానే సర్వే ప్రారంభించాలన్నారు. ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు బంగారు కుటుంబాల అదనపు చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలన్నారు. బంగారు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి మార్గదర్శీలు బాటలు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పీ–4 విధానం రాష్ట్ర కమిటీ సభ్యుడు సంతోష్ మాట్లాడుతూ బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించడం, వనరులను సమకూర్చే ప్రక్రియ వేగంగా చేయాలని చెప్పారు. నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే పక్కాగా నిర్వహించాలన్నారు. సమావేశంలో సీపీఓ షాలేంరాజు, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, నియోజకవర్గం ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.