
రాజీమార్గమే రాజ మార్గం
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల
రేపల్లె: రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్నివర్గాల కేసుల పరిష్కారం కోసం, దేశం కోసం మధ్యవర్తిత్వం అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేలా బుధవారం స్థానిక తాలూకా కార్యాలయం నుంచి నిర్వహించిన వన్ కే వాక్‌లో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం న్యాయశాఖ ప్రతి నెలా మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తుందన్నారు. ఇరు వర్గాలకు న్యాయం చేసి కేసులను త్వరగా పరిష్కరించడమే లక్ష్యంగా న్యాయశాఖ పనిచేస్తుందన్నారు. లోక్ అదాలత్‌లతో కేసులు త్వరగా పరిష్కారం అవటంతోపాటు కక్షిదారులకు సత్వర న్యాయం చేకూరుతుందన్నారు. తాలూకా సెంటర్ నుంచి ఓల్డ్ టౌన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతాభార్గవి, న్యాయవాదులు, పోలీసులు, పారామెడికల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
నరసరావుపేటరూరల్: అల్లూరివారిపాలెం రోడ్డులోని లింగంగుంట్ల చెక్‌పోస్ట్ సమీపంలోని మానసాదేవి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు దంపతులు, నేరేళ్ల విజయలక్ష్మి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.
ఉద్యోగం నుంచి వార్డెన్ తొలగింపు
కారెంపూడి: స్థానిక మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ఇన్‌ఛార్జి వార్డెన్ శౌరీ భాయిని ఉద్యోగ విధుల నుంచి తప్పించినట్లు డీఈఓ ఎల్.చంద్రకళ ఆదేశాలు జారీ చేశారని ఎంఈఓ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డెన్‌పై వచ్చిన అభియోగాలు నిజమని కమిటీ విచారణలో తేలడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు డీఈఓ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎంతో బాధ్యతగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యాన్ని, అభ్యంతకర ప్రవర్తనను ఉపేక్షించేది లేదని ఎంఈఓ రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మైనార్టీ విద్యాసంస్థల్లో నేరుగా ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుపుతున్న మైనార్టీ బాల,బాలికల పాఠశాలలతోపాటు ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు కన్వీనర్ ఎం. రజని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పొన్నూరు రోడ్డులోని మైనార్టీ బాలికల పాఠశాల, పాత గుంటూరు నందివెలుగు రోడ్డులోని బాలుర పాఠశాలలో 5,6,7,8వ తరగతులతోపాటు ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 87126 25038, 87126 25039, 87126 25073 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
3 వేల కిలోల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
పొన్నూరు: పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుకాణంలో బుధవారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాదాపు మూడు వేల కిలోల ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం 21 వార్డులోని ఓ ట్రేడర్స్‌లో విక్రయానికి ఉంచిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యజమానికి రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

రాజీమార్గమే రాజ మార్గం

రాజీమార్గమే రాజ మార్గం