
చరిత్రకు చిరునామా బాపట్ల వ్యవసాయ కళాశాల
బాపట్ల: చరిత్రకు చిరునామాగా బాపట్ల వ్యవసాయ కళాశాల నిలిచిపోయిందని నకాసా క్రాప్ సైన్‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగర్లమూడి చంద్రశేఖర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 80వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం కళాశాలలో నిర్వహించారు. జాగర్లమూడి మాట్లాడుతూ ఎనిమిది దశాబ్దాలుగా విద్యారంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ విశేష సేవలు అందిస్తున్న బాపట్ల వ్యవసాయ కళాశాల ఆదర్శనీయమైన పాత్రను నిర్వహిస్తుందన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఉభయ రాష్ట్రాలలో అనేక ఇతర వ్యవసాయ కళాశాలల ఆవిర్భావానికి స్ఫూర్తిదాయకమైందని అన్నారు. ఇక్కడ వ్యవసాయ విద్యార్థులకు బోధనా సిబ్బంది నేర్పించే నైపుణ్యాల ప్రభావమే ఇందుకు దోహద పడిందన్నారు. పట్టభద్రులైన అనంతరం కేవలం ఉద్యోగ సముపార్జనే దృష్టిగా భావించకుండా పలు వ్యవసాయ పరిశ్రమలను స్థాపించే దిశగా పట్టభద్రులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ ఉద్యోగతను కల్పించేందుకు సరికొత్త వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణలను సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి మాట్లాడుతూ ప్రపంచ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే బీజం పడిందని, దేశ దేశాలలో తమ వ్యవసాయ సాంకేతిక ప్రతిభను చాటి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞులుగా ఇక్కడి విద్యార్థులు నిలిచారని పేర్కొన్నారు. జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.తుషారకు ఉత్తమ పరిశోధన పత్రాన్ని సమర్పించినందుకు బంగారు పతకాన్ని బహూకరించారు. డాక్టర్ బాలినేని వెంకటేశ్వర్లు, బాలినేని స్వరూపరాణిలు డి.మంజూషకు వెండి పతకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో పలువురు పూర్వ అసోసియేట్ డీన్లను సత్కరించారు. విశ్వవిద్యాలయ అధికారులు, పూర్వ విద్యార్థులు, పీహెచ్‌డి, పీజీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
నకాసా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జాగర్లమూడి చంద్రశేఖర్ ఘనంగా వ్యవసాయ కళాశాలవ్యవస్థాపక దినోత్సవం