
అమరవీరుల కుటుంబాలకు ఆర్మీ అండగా ఉంటుంది
చందోలు(కర్లపాలెం): కార్గిల్ అమరవీరుడు మహ్మద్ హాజీ బాషా త్యాగాన్ని భారతీయులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని, అమరవీరుల కుటుంబాలకు ఆర్మీ అండగా ఉంటుందని ఎనిమిదో మౌంటెన్ విజన్ హెడ్ క్వార్టర్ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో) ఎం వెంకటరెడ్డి చెప్పారు. 1999వ సంవత్సరంలో ఆపరేషన్ విజయ్‌లో భాగంగా కార్గిల్‌లో జరిగిన యుద్ధంలో జరిగిన బాంబు బ్లాస్టింగ్‌లో బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన జవాన్ మహమ్మద్ హాజీ బాషా అమరుడయ్యారు. 26వ కార్గిగల్ దివస్ సందర్భంగా మంగళవారం 8వ మౌంటెన్ డివిజన్ హెడ్‌క్వార్టర్ జవాన్లు చందోలు గ్రామానికి వచ్చి మాజీ సైనికులతో కలసి కార్గిల్ అమరవీరుడు, సేనా మెడల్ అవార్డు గ్రహీత హాజీబాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హాజీ బాషా కుటుంబ సభ్యులకు కార్గిల్ దివస్ మెమోంటో, ప్రశంసాపత్రం అందజేశారు. హాజీ బాషా పోరాట పటిమను, త్యాగనిరతిని స్థానిక విద్యార్థులకు, గ్రామస్తులకు సైనికులు వివరించారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ కార్గిల్ వీరుని గుర్తుగా చందోలు గ్రామానికి మహ్మద్ హాజీ బాషా పేరుతో ముఖ మండపం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో 8వ మౌంటెన్ డివిజన్ హవల్‌దార్ రాజేష్, చిరంజీవులు, మాజీ సైనికుల అసోసియేషన్ చందోలు, చెరుకుపల్లి, నిజాంపట్నం బాపట్ల అధ్యక్షులు దావూద్, సస్త్రక్ సుల్తాన్, టి.సుబ్బారావు, పి.ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జేసీవో ఎం.వెంకటరెడ్డి కార్గిల్ అమరవీరుడు హాజీ బాషా చిత్రపటానికి ఘన నివాళి