
23,24 తేదీల్లో భవన నిర్మాణ సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఈనెల 23, 24 తేదీల్లో పాత గుంటూరులోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు భవన నిర్మాణ కార్మిక సంఘం సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం గుంటూరు బ్రాడీపేటలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. గత ఏడు సంవత్సరాలుగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పనిచేయకపోవడం వల్ల కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని చర్చించి భవిష్యత్ ప్రణాళికను ఈ మహాసభల్లో చర్చించనున్నట్లు తెలిపారు.
కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వారిని అవమానించడమేనన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.కోటేశ్వరరావు, నగర తూర్పు, పశ్చిమ కమిటీల కార్యదర్శులు దీవెనరావు, ఎస్.కె.ఖాసీం వలి, దూదేకుల మస్తాన్ వలి, ఎలక్ట్రికల్ యూనియన్ నాయకులు సీతారామయ్య, బోయపాటి అక్కారావు, నికల్సన్, విమల్, తదితరులు పాల్గొన్నారు.