
మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల బిక్షాటన
బాపట్ల: మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి స్పందన కనిపించకపోవడంతో కార్మికులు పట్టణంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం నుంచి పాత బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె నిర్మించేది లేదని సీఐటీయూ నాయకులు మజుందార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాత్కాలికంగా ప్రైవేటు వర్కర్లతో పనులు చేయించుకున్నప్పటికీ అది శాశ్వత పరిష్కారం కాదన్నారు. సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు సమ్మెబాట వీడేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, సామిరెడ్డి, ప్రమీల, నరేష్ పాల్గొన్నారు.