
కార్మికుల సమస్యలపై ఉదాసీనత తగదు
రేపల్లె: సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం తగదని మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని, ఇతర సమస్యలపై నెల రోజుల నుంచి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. చాలీచాలని వేతనాలతో బాధపడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్నారు. జీఓ 36 ప్రకారం వెంటనే వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను సత్వరం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని చెప్పారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మణిలాల్, మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభాకరరావు, రవి, రాఘవేంద్రరావు, సుబ్బారావు, శ్రీనివాస్, గీత, అనూష, తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఉమామహేశ్వరరావు