
ఇసుకప్పగింతలు
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి,బాపట్ల: చీరాల నియోజగవర్గంలోని చీరాల, వేటపాలెం రెండు మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలోనూ కావాల్సినంత ఇసుక లభ్యమవుతుండటంతో పచ్చనేత ప్రతిపాదన ఇసుకదందా నిర్వాహకులకు నచ్చింది. నెలకు రూ. 30 లక్షలు చెల్లించినా మంచి లాభాలే ఉంటాయని లెక్కలు వేసుకున్న పచ్చపార్టీకే చెందిన ఓ ఇసుక వ్యాపారితోపాటు చీరాల ప్రాంతానికి చెందిన మరొక పచ్చనేత కలిపి చీరాల పచ్చనేతకు నెలకు రూ. 30 లక్షలు చెల్లించేందుకు సై అన్నారు.
అక్రమ రవాణాకు శ్రీకారం
చీరాల ప్రాంతానికే చెందిన కొందరు పచ్చనేతలు నెలకు రూ.15 లక్షల వరకూ ఇస్తామని సదరు నేతకు ప్రతిపాదన పెట్టినా ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరిన ఇద్దరు పచ్చనేతలు రూ. 30 లక్షలు చెల్లిస్తామనడంతో చీరాల పచ్చనేత వారికే ఇసుక వ్యాపారం అప్పగించారు. అనుకున్నదే తడవుగా ఇసుక వ్యాపారులు ఆదివారం టెంకాయకొట్టి టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారు. తొలుత నాణ్యమైన ఇసుక లభ్యమయ్యే పందిళ్లపల్లి, దేశాయి పేటలనుంచి ఇసుకను తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చీరాలనుంచి ఇప్పటికే నిత్యం ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఈ ప్రాంతం నుంచి బాపట్ల, చీరాల నియోజకవర్గాలతోపాటు పర్చూరు ప్రాంతానికి సైతం ఇసుకను తరలించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. కొత్తదందాతో ఇసుక అక్రమ వ్యాపారం మరింతగా పెరగనుంది.
వాన్‌పిక్, అసైన్డ్, అటవీ భూముల్లోనూ..
చీరాల ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతోంది. ఇక్కడి పచ్చనేతలు వాన్ పిక్ భూములనూ వదల్లేదు. ప్రభుత్వ, అసైన్డ్, అటవీ భూములనుంచీ ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. ఇక ఉప్పుతో కూడిన ఇసుక అయినా తీరప్రాంతంలోని ఇసుకను రియల్ వెంచర్లు, పునాదులు పూడ్చడంతో పాటు ఇతర అవసరాలకు రేయింబవళ్లు తరలించి అమ్ముతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో తీరప్రాంతం గుంతలమయంగా మారుతోంది. సీఆర్‌జెడ్ నిబంధనలు ఉన్నా ఆ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఇసుక అక్రమ తరలింపుతో పందిళ్లపల్లి ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంతలోని పుల్లరిపాలెం ఎస్టీకాలనీ ప్రజలతోపాటు ఇతరులు పలుమార్లు జిల్లా కలెక్టర్ తోపాటు జాతీయ ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమీషన్ కోరినా అప్పట్లో వేటపాలెం మండల అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. జిల్లా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు చీరాల ప్రాంతంలో మళ్లీ ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.
పందిళ్లపల్లి ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు
ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్న మాఫియా
న్యూస్‌రీల్
చీరాలలో ఇసుక అమ్ముకునేందుకు పచ్చనేతకు ప్రతి నెలా అందనున్న పైకం నియోజకవర్గంలో జోరందుకున్న ఇసుక దందా ఆదివారం కొబ్బరికాయ కొట్టి ఇసుక తవ్వకాలు ప్రారంభించిన వేలంపాట నిర్వాహకుడు పందిళ్లపల్లి, దేశాయిపేట నుంచి ఇసుక తరలింపు సముద్ర తీరగ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో విక్రయం అధిక ధరలకు అమ్మకాలు అధికారులకు నెల మామూళ్లు ! భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు ప్రజల ఫిర్యాదులు పట్టించుకోని జిల్లా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు
ఇదే పద్ధతిలో కొంతకాలం క్రితం చీరాల పచ్చనేతతో ఇసుక వ్యాపారి ఒప్పందం కుదుర్చుకొని ఒక నెల కప్పం రూ. 30 లక్షలు చెల్లించి ఇసుకను రేయింబవళ్లు తరలించారు. అయితే చీరాల ప్రాంతానికి చెందిన పచ్చ నేతలు అతనికి పోటీగా ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకున్నారు. ఇదే విషయాన్ని ఇసుక వ్యాపారి సదరు పచ్చనేత దృష్టిలో పెడితే అదంతా తనకు సంబంధం లేదని, వ్యవహారం మీరే చూసుకోవాలని చావుకబురు చల్లగా చెప్పారు. పందిళ్లపల్లి ప్రాంతానికి చెందిన కొందరు పచ్చనేతలు ఇసుక అక్రమ రవాణా మానుకోలేదు. వారి పోడు పడలేక ఇసుక వ్యాపారి ఈ వ్యాపారం తన కొద్దని చేతులెత్తి పచ్చనేతకు దండం పెట్టాడు. స్థానిక పచ్చనేతలు నెల మామూళ్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్రమ సంపాదన కోసం తహతహలాడే పచ్చనేత తిరిగి ఇసుక వ్యాపారం తెరపైకి తెచ్చారు. దీంతో మరోమారు ఇసుక వ్యాపారి చీరాల ఇసుక దందా నిర్వాహకుడితో కలిసి ఇసుక అక్రమ వ్యాపారానికి సిద్ధపడ్డారు. పచ్చనేత నుంచి వర్తమానం అందిందేమో ఇసుక అక్రమ రవాణా పెద్దస్థాయిలో మొదలైందని తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

ఇసుకప్పగింతలు

ఇసుకప్పగింతలు