
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
● డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్ ● ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
బాపట్ల: బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్ అన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. పరిష్కరించి, న్యాయం చేయాలని అభ్యర్థించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని డీఆర్వో చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. సమస్య పరిష్కారం అయిన విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలుగులో ధ్రువీకరణ పత్రాన్ని ఫిర్యాదుదారులకు అందించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, ఉప కలెక్టర్ నాగిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినాయకునికి సంకటహర చతుర్ధి పూజలు
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో సోమవారం సంకటహరచతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల పుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మాచర్ల మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై కేసు
వెల్దుర్తి: మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్, మరో ఇద్దరిపై వెల్దుర్తి పోలీసు స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదయింది. 2022లో పార్టీ మారమని టీడీపీ నాయకుడు దారపునేని శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేసినట్లుగా కేసు నమోదయింది. దీనిపై దారపునేని ఆదివారం ఫిర్యాదు చేయగా కిషోర్‌తో పాటు మండలంలోని బోదిలవీడు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబురావులపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పలు అక్రమ కేసులతో కిషోర్‌ను ఇబ్బందులకు గురిచేస్తూ, కక్షసాధింపులకు దిగిన కూటమి నేతలు మూడేళ్ల నాటి ఘటనను బూచిగా చూపి మరో అక్రమ కేసు నమోదు చేయించారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
రేపటి నుంచి శివాలయంలో పవిత్రోత్సవాలు
పెదకాకాని: శివాలయంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి రాహుకేతువు పూజలు, నవగ్రహపూజలు, రుద్ర, చండీ హోమాలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, శాంతి కల్యాణాలతో పాటు అన్ని సేవలు నిలుపుదల చేసినట్లు తెలిపారు. 19వ తేదీ నుంచి ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కై ంకర్యాలు, అన్ని ఆర్ణీత సేవలు, రాహుకేతు పూజలు, యథావిధిగా జరుగుతాయన్నారు. దేవస్థానంలో వాహనపూజలు, అన్నప్రాసనలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి