
ఇప్పుడెలా.. గురూ!
చీరాల: ఏరు దాటిసి తెప్పతగలేసిన చందంగా కూటమి పాలన తలపిస్తోంది. విద్యాసంస్థల్లో హడావుడిగా, హంగు ఆర్భాటాలతో యోగాంధ్ర, మెగా పీటీఎం కార్యక్రమాలు నిర్వహించారు. అయితే నిర్వహణకు ఒక్క రూపాయి ఇవ్వకుండా స్కూల్ గ్రాంట్‌లలో 25శాతం వినియోగించి ఏర్పాట్లు చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చి సరిపెట్టారు. దీంతో ఉపాధ్యాయులు, అధ్యాపకులు అవాక్కయ్యారు. పాఠశాలల్లో గ్రాంట్లు అంతంతమా త్రంగా ఉండడం, జూనియర్ కళాశాలల్లో అసలు లేకపోవడంతో అప్పో, సొప్పో చేసి కార్యక్రమాలు జరిపించారు. రికార్డుల కోసం ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమం తమకు గుదిబండగా మారిందని ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాపోతున్నారు. జిల్లాలో 1432 పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాల, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణకు రూ.6 నుంచి రూ. 25 వేల వరకు ఖర్చయింది. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సమావేశాలు నిర్వహించగా, ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో సైతం నిర్వహించారు.
అప్పులతో తిప్పలు
జిల్లాలో మొత్తం 17 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కళాశాలల్లో సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం స్నాక్స్, టీ, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వీటిన్నింటిని అధ్యాపకులే అప్పులు చేసి సమకూర్చారు. అలానే టెంట్లు, కుర్చీలు అద్దెకు తెచ్చుకున్నారు. ఒక్కో కళాశాలకు సుమారుగా రూ.25వేలు ఖర్చయింది. ఆ సొమ్మంతటినీ ప్రభుత్వం చెల్లించకపోతే తాము నష్టపోతామని వారు వాపోతున్నారు.
స్కూల్ గ్రాంట్ వాడితే ఎలా ?
మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును స్కూల్ గ్రాంట్స్‌ను నుంచి వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. అయితే సంవత్సరానికి స్కూల్‌లో వివిధ రకాల ఖర్చులకు అందించే నగదును ఇటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తే.. మరి మిగిలిన కార్యక్రమాలకు నిధులు ఎక్కడనుంచి తెచ్చి వినియోగించాలని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
ఏరు దాటాక తెప్పతగలేసిన కూటమి సర్కార్ మెగా పీటీఎంకు భారీ ఖర్చు గ్రాంట్‌లు లేక... రాక అప్పులు చేసి నిర్వహించిన విద్యాసంస్థలు ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు