
కొత్తపల్లిలో పోలీసు జులుం
మాచర్ల రూరల్: బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం జరగకుండా పోలీసులు అడ్డుకొని పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న సంఘటన పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. వైఎస్సార్ సీపీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో ఎలాగైనా అడ్డుకోవాలనే అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకు పోలీసులు కొత్తపల్లి గ్రామానికి చేరుకొని సభ జరగకుండా అడ్డుకున్నారు. గ్రామంలో నివాస గృహాల మధ్య సొంత స్థలంలో పార్టీ కార్యకర్తలు షామియానాలను ఏర్పాటు చేసుకొని సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవ్వగా విజయపురిసౌత్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని సభా నిర్వహణకు అనుమతులు లేవని, ఎట్టి పరిస్థితిలో సమావేశం జరపటానికి వీలు లేదంటూ హుకూం జారీ చేశారు. దీనిపై అక్కడే ఉన్న కార్యకర్తలు, నాయకులు తమ సొంత స్థలంలో పార్టీ ప్రోగ్రాం చేసుకునేందుకు ప్రత్యేక అనుమతులు అవసరమా.. గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న టీడీపీవారు ప్రతి గ్రామంలో కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి అనుమతులు పొందారని, ఇప్పుడు మమ్మల్ని ఇలా అడ్డుకునే ప్రయత్నాలు చేయటం ఎంత వరకు సబబని వారు ప్రశ్నించారు. అయినా పోలీసులు వినిపించుకోకుండా సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, ఇరువురిని అదుపులోకి తీసుకొని రూరల్ సర్కిల్ స్టేషన్‌కు తరలించారు.
గౌతంరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు కొత్తపల్లి గ్రామానికి వచ్చిన వైఎస్సార్ సీపీ పార్లమెంట్ నియోజక వర్గ పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సభా నిర్వహణకు అనుమతులు లేవని, మీరు గ్రామంలోనికి రావద్దంటూ ఆయన్ను కారులోనే నిలిపివేశారు. ఆయన తీవ్రంగా స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పాలనను లోపాలను విమర్శించే హక్కును హరించడం బాగాలేదని.. కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించటం తగదంటూ సూచించారు. పోలీసులు అడ్డుకోవటంతో తిరిగి మాచర్లకు వచ్చారు.
రెడ్‌బుక్ రాజ్యాంగం మేరకే..
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పార్టీ ప్రోగ్రాంని కొత్తపల్లి గ్రామంలో జరగకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాచర్ల నియోజకవర్గంలో పక్కాగా అమలు పరుస్తున్నారని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పూనూరి గౌతంరెడ్డి విమర్శించారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కొత్తపల్లి గ్రామంలో జరుపుతుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని సభను అడ్డుకోవటం దారుణమన్నారు. తమ సొంత స్థలంలో సభ జరుపుతుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ స్పష్టంగా అమలవుతుందని అర్ధమవుతుందన్నారు.
●పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియోజకవర్గానికి రాకుండా అడ్డుకుంటున్నారని, అతి త్వరలో పీఆర్కే ఆధ్వర్యంలో మాచర్ల నడిబొడ్డున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తామన్నారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి, పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్ తదితరులున్నారు.
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ సభను అడ్డుకున్న పోలీసులు కార్యకర్తలు, నాయకులను అదుపులోకి తీసుకున్న వైనం
వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు గౌతంరెడ్డి అడ్డగింత