
శాకంబరిగా బాల చాముండేశ్వరి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం అమ్మవారిని కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. ఆలయంలోని జ్వాలాముఖి దేవికి కూడా శాకంబరిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.