
చీరాల ‘చైర్మన్’పై గందరగోళం
చీరాలలో చైర్మన్ ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే ఎటూ తేల్చకపోవడంతో టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవి ఆశిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కౌన్సిలర్లను మంచిగా ‘చూసుకునే’ వారికే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
చీరాల: ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినా కొత్త చైర్మన్ ఎంపిక కత్తి మీద సాములా మారింది. కుల సమీకరణలు, ఆదాయ వనరులను బట్టి ఎక్కువ మొత్తం వెచ్చించిన వారికే దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంపు ఏర్పాటు, విశాఖపట్నం, పాపికొండల టూర్ అంటూ సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పదవీ కాలం ఉండడంతో డబ్బు ఖర్చు పెట్టేందుకు మరికొందరు సంశయిస్తున్నారు. చైర్మన్ పదవిపై మోజు ఉన్నవారు మాత్రం తహతహలాడుతున్నారు. ఈ నెల 16న జరిగే ఎన్నికలో చైర్మన్ ఎవరనేది తేలనుంది.
‘అవిశ్వాసం‘తో వేటు
చీరాల మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాలపాటు చైర్మన్‌గా పనిచేసిన జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గతంలో ముందుకొచ్చారు. టీడీపీ మద్దతు కౌన్సిలర్లతోపాటు ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 22 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ఏప్రిల్ 23న కలెక్టర్ జె.వెంకట మురళికి 17 మంది సభ్యులు అందించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికారు. దీంతో మే 14న కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్‌అఫీషియోలతో కలిపి 26 మంది పాల్గొని అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకొని క్యాంపుల పేరు ఇతర ప్రాంతాలకు పంపించారు. చైర్మన్ సీటును ఆశిస్తున్న వారు మిగిలిన కౌన్సిలర్లకు సకల రాజమర్యాదలు చేసి అవిశ్వాస ఓటింగ్ నాటికి తిరిగి చీరాలకు తీసుకువచ్చారు. అవిశ్వాసం నెగ్గిన నాటి నుంచి ఎవరికి చైర్మన్ పదవి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సామాజిక, రాజకీయ సమీకరణాలు చూస్తే తమకే సీటు కేటాయించాలని ఆశావహులు ఇప్పటికే ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రేసులోని వారందరూ వైఎస్సార్‌సీపీ సభ్యులే
చీరాల మున్సిపల్ ఎన్నికలలో 33 వార్డుల్లో ఎక్కువ శాతం వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్లు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి 9 మంది ఉన్నారు. 2024లో ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించిన తర్వాత ఆ పదవికి పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీలో ఉన్నవారే. అయితే టీడీపీ సింబల్‌పై గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావు రేసులో లేకపోవడంతో వైఎస్సార్‌సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లకే అవకాశం ఉంది. రేసులో ఉన్నవారంతా మిగిలిన కౌన్సిలర్లను అన్నివిధాలా ‘మంచి’ చేసుకోవాల్సి పరిస్థితి నెలకొంది.
చీరాల మున్సిపల్ చైర్మన్ పదవిపై ఎటూ తేల్చని ఎమ్మెల్యే రోజు రోజుకూ పెరిగిపోతున్న ఆశావహుల జాబితా కౌన్సిలర్లకు డబ్బులిచ్చి మద్దతు పొందే వారికే ప్రాధాన్యత
బరిలో ప్రధానంగా నలుగురు
ఎనిమిది నెలల పదవీకాలం ఉన్న మున్సిపల్ పాలక వర్గానికి తమనే చైర్మన్‌గా చేయాలంటూ ఇప్పటికే ఎమ్మెల్యే ముందు నలుగురు ప్రతిపాదనలు ఉంచారు. ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సామాజికవర్గానికి చెందిన మించాల సాంబశివరావు, సీనియార్టీ ప్రకారం తనకే ఇవ్వాలని పొత్తూరి సుబ్బయ్య, గౌడ సామాజికవర్గానికి చెందిన సూరగాని లక్ష్మి, చేనేత సామాజికవర్గానికి చెందిన గోలి స్వాతి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో అనేక రాజకీయ, సామాజిక సమీకరణలతో ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.