
ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం
ఆర్‌ఈఎంజెడ్ కోసం భూములిచ్చే రైతులతో కలెక్టర్
బాపట్ల: అద్దంకి నియోజకవర్గంలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (ఆర్‌ఈఎంజెడ్) స్థాపనకు అవసరమైన భూమి కొనుగోలుకు ఎకరాకు రూ.18 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో రైతులతో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఆర్‌ఈఎంజెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. బల్లికురువ, సంతమాగులూరు మండలాల్లోని కుందూరు, మామిళ్ళపల్లి, మక్కినవారి పాలెం, గుడిపాడు గ్రామాలలో భూమి కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. దాదాపు 1,800 ఎకరాల కొనుగోలుకు నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు ఎకరాకు రూ. 20 లక్షలు ఇవ్వాలని కోరారని తెలిపారు. ల్యాండ్ ఎక్విజేషన్ నిబంధన మేరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జోన్ ఏర్పాటుతో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. దాదాపు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్థానికుల్లో అర్హులైన వారికి ముందుగా అవకాశం కల్పిస్తారని తెలిపారు. నిబంధన మేరకు ఎకరాకు రూ.18 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి రైతులందరూ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, ఉప కలెక్టర్ లవన్న, బల్లికురవ మండల రెవెన్యూ అధికారి ఎం.రవినాయక్, సంతమాగులూరు మండల రెవెన్యూ అధికారి కె.రవిబాబు, జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివ శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌ఎంఆర్‌ల వేతనాలు పెంపు
ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌ల రోజు వారీ వేతనాన్ని వీడీఏ పాయింట్ల ఆధారంగా పెంచినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పలు శాఖల్లో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌ల రోజువారీ వేతనాలను సవరించినట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం గల వారికి రూ.900 ఉండగా, ఇప్పుడు రూ.937గా మార్చినట్లు వివరించారు. నైపుణ్యం గల వారికి రూ.850 ఇస్తుండగా ఇప్పుడు రూ. 885కి, సెమీ స్కిల్డ్ వారికి రూ.750 ఇస్తుండగా.. రూ.781కి, నైపుణ్యం లేని వారికి ప్రస్తుతం రూ.650 ఇస్తుండగా రూ.677కి పెంచినట్లు తెలిపారు. ఈ వేతనాలు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వర్తిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకట శివప్రసాద్, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.