
కోన ప్రభాకరరావు విగ్రహం ఏర్పాటుకు డిమాండ్
బాపట్ల: జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం ప్రత్యేకత చాటుకున్న దివంగత కోన ప్రభాకరరావు విగ్రహాన్ని బాపట్ల పాత బస్టాండ్ డివైడర్‌పై తిరిగి ప్రతిష్టించాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. గురువారం కోన ప్రభాకర రావు 109వ జయంతి సందర్భంగా కోన రఘుపతి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. కోన ప్రభాకర రావు బాపట్లకు చేసిన సేవలు స్మరించుకునేలా విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు స్ఫూర్తిని పొందేలా చూడాలన్నారు. రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన విగ్రహాలను తిరిగి అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు మాట తప్పారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్, గుర్రం జాషువా, పొట్టి శ్రీరాములు విగ్రహాలను కూడా తిరిగి ప్రతిష్టించాలని కోరారు. పురపాలక సంఘం ఆమోదించిన తీర్మానం ఇప్పటికై నా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, యువజన నాయకులు కోకిలగడ్డ చెంచయ్య, డి.జయభారత్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగం నాయకుడు షేక్ సయ్యద్ పీర్, బులిరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, జోగి రాజా, ఇనగలూరి మాల్యాద్రి, షోహిత్, ఉరబిండి గోపి, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, వేల్పుల మీరాబీ, మునీర్, కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు చల్లా రామయ్య ఆధ్వర్యంలో చేతి కర్రలను పంపిణీ చేశారు.