
విద్యారంగ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రేపల్లె: విద్యారంగ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా అందరినీ ఆత్మీయంగా కలిపే కార్యక్రమం ఇదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేసే సంస్కృతిని పెంచడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. ‘ఒక క్లాసుకు ఒక టీచర్’ విధానంలో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మొక్కలు అందించారు. ఆర్డీవో రామలక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ కట్టా మంగ, కమిషనర్ సాంబశివ రావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, నాయకులు పంతాని మురళీధరరావు, మేకా రామకృష్ణ, స్కూల్ హెచ్‌ఎం సీహెచ్ సుందరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్