
అక్రమ నిర్మాణాలు చేసిన రిసార్టులపై చర్యలు
చీరాల టౌన్: చీరాల తీర ప్రాంతాల్లో సీఆర్‌జెడ్ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేసిన రిసార్ట్స్‌పై చర్యలు తప్పవని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా డీపీవో ప్రభాకరరావు, పొల్యూషన్ కంట్రోల్ ఈఈ రాఘవరెడ్డిలతో కలిసి వాడరేవు, రామాపురం, విజయలక్ష్మీపురం, కఠారిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన పలు రిసార్ట్సులను పరిశీలించారు. సముద్ర మట్టానికి దగ్గరగా నిర్మాణాలు చేసిన రిసార్ట్సు వివరాలను సేకరించి కొలతలు తీసుకున్నారు. నిబంధనలు విస్మరించి అక్రమ కట్టడాలు చేసిన పలువురు నిర్వాహకులకు నోటీసులు అందించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.