
డ్రెయిన్లలో పూడికతీత పనులు ప్రారంభం
రేపల్లె: ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా డ్రెయిన్లలో పూడిక తీయించకపోవడంపై గత వారం సాక్షిలో ‘‘ముంపు ముప్పు’’ అనే శీర్షికన నియోజవర్గంలోని ప్రధాన మురుగు కాలవలు గురప్రు డెక్క, తూటి కాడతో పూడి పోవడంతో పంటకు నష్టం జరిగే ప్రమాదాన్ని వివరిస్తూ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వాడ మురుగు, ఆర్‌ఎం డ్రెయిన్లలో గురప్రు డెక్క, తూటి కాడలను తీయిస్తున్నారు. దీనిపై నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సాక్షికి కృతజ్ఞతలు తెలియజేశారు.
సమష్టి కృషితో డిపో అభివృద్ధి
చీరాల అర్బన్: ఉద్యోగుల సమష్టి కృషితోనే డిపో అభివృద్ధి సాధ్యమవుతుందని బాపట్ల డీపీటీఓ సామ్రాజ్యం అన్నారు. గురువారం చీరాల ఆర్టీసీ డిపో, బస్టాండ్, గ్యారేజీలను ఆమె పరిశీలించారు. బస్సులను పూర్తి కండిషన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం బస్టాండ్‌లోని పలు విభాగాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ పరిసరాలు, మరుగుదొడ్లు, స్టాల్స్‌ను పరిశీలించారు. తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓఆర్ పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, బస్సుల సమయపాలన పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. డిపో మేనేజర్ జంజనం శ్యామల, సిబ్బంది ఉన్నారు.
నెలాఖరులోగా
పనులు పూర్తి చేస్తాం
ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి
శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా గురువారం క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారుల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలోని మేజరు కాల్వల్లో రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు.
నీటిగుంటలో పడి వ్యక్తి మృతి
వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వ తేదీన గ్రామ సమీపంలో బహిర్భూమికని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రెయిన్లలో పూడికతీత పనులు ప్రారంభం

డ్రెయిన్లలో పూడికతీత పనులు ప్రారంభం