
శరణు శాకంబరి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరి ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. కనకదుర్గనగర్, మహామండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కదంబ ప్రసాదం పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలో చేసిన అలంకారం నుంచి ఒక్క కూరగాయ, ఆకుకూరనైనా ఇంటికి తీసుకువెళ్లాలనే భావనతో భక్తులు కూరగాయల కోసం ఎగబడటం కనిపించింది.
చివరి రోజైన గురువారం అమ్మవారిని పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించనున్నారు. ఇందు కోసం యాలకులు, జీడిపప్పులతో దండలను సిద్ధం చేస్తున్నారు. యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.

శరణు శాకంబరి