
ఎర్ర జెండాలు కన్నెర్ర
ఎర్ర జెండాలతో చీరాల పట్టణంలో ర్యాలీ తీస్తున్న వివిధ రంగాల కార్మికులు
చీరాల: కార్మికులను కట్టు బానిసలుగా మార్చడంతోపాటు కంపెనీల యాజమానులకు అధిక లాభాలను తీసుకొచ్చేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన కార్మిక చట్టాలను రూపొందించాయని ఏపీ ఐఎల్‌టీడీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధనలక్ష్మి పేర్కొన్నారు. దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె చీరాలలో విజయవంతం అయింది. సీఐటీయూ, వైఎస్సార్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీ యూనియన్లు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నాయి. కార్మికుల హక్కులను, రక్షణను విస్మరించే చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నాయకులు, కార్మికులు ఎర్ర జెండాలతో సమ్మె నిర్వహించారు. ఈ కారణంగా ఐఎల్‌టీడీ కంపెనీ మూతపడింది. కంపెనీ వద్ద జరిగిన ప్రదర్శనలో ఫెడరేషన్ నాయకులు ధనలక్ష్మి మాట్లాడారు. వంద సంవత్సరాల క్రితం సమ్మెలు చేసి కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్నారని, ప్రస్తుత చట్టాలు అమల్లోకి వస్తే ఆ చట్టాలన్నీ కోల్పోతారన్నారు. పట్టణంలో వివిధ కార్మిక సంఘాలు, అంగన్‌వాడీ, మెప్మా, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ నాయకులు వసంతరావు, గోసాల సుధాకర్, పఠాన్ కాలేషా, కె.రామకృష్ణ, బాబ్జి, కాలేషా, ఆనందబాబు, నాగరాజు, వెంకటేశ్వర్లు, పోతురాజు, అమీర్, కార్మికులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
బాపట్ల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో బుధవారం బాపట్లలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి జీబీసీ రోడ్డు, రథం బజారు ద్వారా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది.ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, ఏఐటీయూసీ నాయకులు సింగరకొండ, కె.శరత్, బి.తిరుమలరెడ్డి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజబెత్, గీత, కృష్ణవేణి, రాహేలు, రత్నం, బుచ్చిరాజు హరిబాబు, ఒ.లక్ష్మణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమ్మె విజయవంతం
యజమానులకు లాభాలు
తెచ్చేందుకే లేబర్ కోడ్స్
మండిపడిన కార్మిక లోకం

ఎర్ర జెండాలు కన్నెర్ర