విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

Jul 9 2025 6:49 AM | Updated on Jul 9 2025 6:49 AM

విద్య

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

రక్షించేందుకు తోటి రైతులు చేసిన ప్రయత్నం విఫలం

కొల్లూరు : వరి ఎండిపోకుండా పంటకు నీరు పెట్టే క్రమంలో కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యుఒడిలోకి చేరిన సంఘటన కొల్లూరులో జరిగింది. కుటంబ సభ్యులు, స్థానిక రైతుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు గుంటపునుగులు చెట్టు ప్రాంతానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావు (53) వరి చేనుకు విద్యుత్‌ మోటరు సాయంతో నీరు పెట్టేందుకు మంగళవారం ఉదయం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న పొలం వద్దకు సహచర రైతులతో కలసి వెళ్లాడు. విద్యుత్‌ సరఫరా ఆలస్యం కావడంతో తోటి రైతులకు ఫోన్‌ చేసి సరఫరా సమయంపై ఆరా తీసి అక్కడే వేచి ఉన్నాడు. కొద్ది సేపటికి కరెంట్‌ రావడంతో మోటరు ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. స్టార్టర్‌ బాక్స్‌కు విద్యుత్‌ వెలువడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని రక్షించేందుకు కర్రలతో కొట్టడంతో పక్కకి పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని హుటాహుటిన కొల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లగా, వైద్యులు సూచనలతో తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, వివాహమైన కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్‌ ్స వివరాల సేకరణ

సత్తెనపల్లి: క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విజిలెనన్స్‌ అధికారులు మంగళవారం వివరాలను సేకరించారు. విజిలెనన్స్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ సైదులు నేతృత్వంలోని నలుగురు విజిలెన్స్‌ బృందం మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శించి ఆర్వో అప్పారావు వద్ద వివరాలు కోరారు. ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ఇచ్చి దాని ప్రకారం వివరాలు నింపాలని సూచించారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామ/వార్డు సచివాలయాల అడ్మిన్‌లు అందర్నీ మున్సిపల్‌ కార్యాలయానికి పిలిపించి వారి చేత ప్రొఫార్మా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు.

మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు

సత్తెనపల్లి:పోలీసుల విచారణకు హాజరు కావాలని వైఎస్సార్‌ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారంటూ పలు సెక్షన్లతో విచారణకు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 11న సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు.

ఉర్దూ బాలుర జూనియర్‌ కళాశాలలో సీట్ల భర్తీ

గుంటూరు ఎడ్యుకేషన్‌: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఉర్దూ మైనార్టీ బాలుర జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ ఇంటర్‌ బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో చేరేందుకు అర్హులైన పేద ముస్లిం విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు సంప్రదించాలని ప్రిన్సిపల్‌ పి. సాంబశివరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బైపీసీలో 20, సీఈసీలో 15 సీట్లలో ప్రవేశానికి బీసీ–ఈ, బీసీ–బీ కేటగిరీ విద్యార్థులు అర్హులని తెలిపారు.

నేడు సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌

లక్ష్మీపురం: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. పాలకులను హెచ్చరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభం అవుతుందని చెప్పారు. బీఆర్‌ స్టేడియం వరకు సాగుతుందని వివరించారు. అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, యువత, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్‌ కుమార్‌, జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ వలి, ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి 
1
1/1

విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement