
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
బాపట్ల : అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పోలీస్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు, స్థల వివాదాలు ఇతర పలు సమస్యలపై వచ్చిన ప్రజల అభ్యర్థనలను ఎస్పీ కూలంకషంగా విని, అర్జీలను పరిశీలించాలని సూచించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను త్వరితగతిన చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవవహరిస్తూ, వారి సమస్యలను నిర్దేశిత గడువులోనే సంతృప్తికర రీతిలో పరిష్కరించాలన్నారు. పునరావృత అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు. అర్జీలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇనన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడీ