
ఆస్తుల కోసం శవ పంచాయితీ
జె. పంగులూరు: మానవత్వం మంటగలిసింది. ఆస్తి పాస్తులకు ఉన్న విలువ మనిషికి లేదని మరోసారి నిరూపితమైంది. ఆస్తుల కోసం మృత దేహాన్ని ఇంటి ముందు పెట్టి, ఆస్తి పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సంఘటన కలచి వేసింది. వివరాలు.. మండలంలోని రామకూరు గ్రామానికి చెందిన ఎర్రిబోయిన సురేష్ వారం రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంఘటన పాఠకులకు తెలిసిందే.. కాగా మృత దేహానికి పోస్ట్‌మార్టం చేయించి మంగళవారం అప్పగించారు. అయితే అతని అంత్యక్రియలను భార్యతో పాటు, భార్య బంధువులు అడ్డుకున్నారు. సురేష్ తండ్రి అంజియ్య ఆస్తి పంపకాలు జరపలేదని, ఆస్తి పంచి.. సురేష్ భార్య తిరపతమ్మకు, ఆమె పిల్లలకు రాసి ఇచ్చేవరకు మృతదేహాన్ని కదిలించడానికి వీలు లేదని తెగేసి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతుడు సురేష్ తండ్రి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. మనుమలు, మనువరాళ్లు కూడా పెద్దవారయ్యారు. అయితే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ అంజయ్య ఆస్తిని కుమారులకు పంచేందుకు అంగీకరించలేదు. దీంతో మంగళవారం నుంచి గురువారం వరకు రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులకు, బంధువులకు వాగ్వాదం, గొడవలు జరిగాయి. చివరికి గురువారం మధ్యాహ్నం రేణింగవరం పోలీస్ స్టేషన్‌కు పంచాయితీ చేరింది. అక్కడ ఎస్‌ఐ వినోద్‌బాబు ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చేందుకు సాయంత్రం 4 గంటలు అయింది. పోలీస్ స్టేషన్ వద్దే పత్రాలు రాసుకుని బంధువులు, కుటుంబ సభ్యులు రామకూరు చేరి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తులు పంచకుండా తమ దగ్గరే ఉంచుకొని, వృద్ధాప్యంలో కూడా తన పెత్తనమే చెల్లాలని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నానికి ఓ కుటుంబలోని నాలుగు ప్రాణాలు బలైపోయిన ఘటన కూడా రామకూరు గ్రామంలోనే జరిగింది. ఇప్పుడు ఆస్తి కోసం అంత్యక్రియలు కూడా అడ్డుకున్న ఘటన కూడా ఇదే గ్రామంలో జరగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
అంత్యక్రియలు అడ్డుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు