
ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
భట్టిప్రోలు(కొల్లూరు): ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే ఎటువంటి విచారణ లేకుండానే నేరుగా కోర్టుకు హాజరుపరుస్తామని మైనింగ్ శాఖ ఏజీఎం పి.ఫణిరాజ్ కుమార్ సింహ హెచ్చరించారు. గురువారం మండలంలోని ఓలేరులో కొన్ని నెలల క్రితం అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశాలతో మైనింగ్, రెవెన్యు శాఖాధికారులు విచారణ చేపట్టారు. ఇసుక తవ్వకాలు చేపట్టిన ఓలేరు ఉచిత ఇసుక క్వారీని మైనింగ్ శాఖ ఏజీఎం పరిశీలించి గ్రామస్తులను విచారించి వారి నుంచి వివరాలు సేకరించారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా వాటిల్లుతున్న ముప్పును గ్రామస్తులు వివరించడంతో ఆయా అంశాలను నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ, తమ పరిశీలనలో వెలుగుచూసిన అంశాలను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కె.స్నేహ, తహసీల్దార్ మేక శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎం.శివయ్య ఉన్నారు.
విచారణ లేకుండానే నేరుగా కోర్టుకు హాజరుపరుస్తాం మైనింగ్ శాఖ ఏజీఎం ఫణిరాజ్ కుమార్ సింహ