
ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామని హమీ ఇచ్చి రూ. 13 వేలే తల్లుల ఖాతాల్లో వేయంటం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా కొంత మంది తల్లులకు అర్హత ఉన్నా పథకం వర్తించకపోవటంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇంటి వద్దకు వచ్చే రేషన్‌ను తొలగించి దివ్యాంగులకు, వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చంద్రబాబు రాజధాని ముసుగులో ప్రజలను మరోసారి మోసగిస్తున్నారన్నారు. పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
జిల్లా వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య