
పీఏసీఎస్‌లలో అంతర్జాతీయ సహకార కార్యక్రమాలు
నరసరావుపేటరూరల్: జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘ కార్యాలయాల్లో అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమాలు సందర్భంగా మోడల్ ఆడిటింగ్, స్వచ్ఛత, మెంబర్‌షిప్ డ్రైవ్, పాఠశాలలలో సహకార సంఘాలపై అవగాహన సదస్సులు, సహకార సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఇక్కుర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 2025వ ఏడాదిని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించి ఉన్నందున ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు సహకార ఉద్యమ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సబ్ డివిజనల్ సహకార అధికారి స్వర్ణ చినరామిరెడ్డి, సంఘ సీఈఓ కంటు శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సౌత్ జోన్‌కు అర్హత సాధించిన శివకోటేశ్వరమ్మ
రెంటచింతల: కేరళలో జరగనున్న సౌత్‌జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు రెంటచింతల–2 సచివాలయం మహిళా పోలీస్ చిన్నపురెడ్డి శివకోటేశ్వరమ్మ అర్హత సాధించింది. జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన 25 ఏపీ రైఫిల్ షూటింగ్ చాంపియన్ 2025 పోటీలలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి శివకోటేశ్వరమ్మ సౌత్‌జోన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ డిస్ట్రిక్ స్థాయిలో కూడా 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించిన శివకోటేశ్వరమ్మ తన ప్రతిభను రోజురోజుకు మెరుగుపరుచుకుంటూ సౌత్‌జోన్ స్థాయి పోటీలకు అర్హత సాధించడం ఆమె కృషి, పట్టుదలకు నిదర్శనం. శివకోటేశ్వరమ్మ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రోత్సహంతోనే ఈ విజయం సాధించినట్లు తెలిపారు.